దుబ్బాకలో కాంగ్రెస్‌ నేతలకు కొత్త కష్టాలు…!

-

ఎన్నికలంటేనే ఆషామాషీ కాదు. అందులోనూ ఉపఎన్నిక అంటే నాయకులకు తలకు మించిన భారం పడుతుంది. పైగా అధికార పార్టీని తట్టుకుని నిలబడటం అంటే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఆర్థికంగా అయినా.. అదనపు బలంకోసమైనా చాలా శక్తిమంతంగా పోరాటం చేయాలి. ప్రస్తుతం దుబ్బాకలో కాంగ్రెస్‌ నాయకులు ఇలాగే కుస్తీ పడుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రచారం.. ఏర్పాట్లు బాగానే ఉన్నా ఖర్చు తడిసి మోపెడు అవుతుందట…

తెలంగాణకు AICC ఇంఛార్జ్‌గా వచ్చిన మాణిక్యం ఠాగూర్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులందరికీ దుబ్బాక ఎన్నికల టాస్క్‌ ఇచ్చారు. స్వయంగా ఆయన కూడా మండలాల వారీగా పర్యటిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా గ్రామాల వారీగా ఇంఛార్జ్‌లుగా వెళ్లిన వారికి ఏం చేయాలో.. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదట.

ఇంచార్జ్ ఠాగూర్‌ చెప్పడం వరకూ బాగానే ఉన్నా.. ప్రచారంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాయకులకు రోజుకు సగటున 10 వేలకుపైనే ఖర్చు అవుతోందట. దీంతో ఉపఎన్నిక పూర్తయ్యే టైమ్‌కు ఒక్కో నాయకుడికి లక్షల్లో చేతి చమురు వదిలేలా ఉందట. అది తెలుసుకుని.. లెక్కలు వేసుకుంటున్న నాయకులకు నిద్ర పట్టడం లేదట. ఉప ఎన్నికలో అభ్యర్థిపై ఆర్థిక భారం పడకుండా చూడటం బాగానే ఉన్నా… మాకీ తలనొప్పులు ఏంటని లబోదిబోమంటున్నారట ఇంఛార్జులు

Read more RELATED
Recommended to you

Latest news