ఠాగూర్ VS వీహెచ్..టీ కాంగ్రెస్ లో వార్ ముదిరినట్టుందే ?

-

ఒకరేమో పార్టీ ఇంఛార్జ్‌.. మరొకరేమో పార్టీలో సీనియర్‌ నేత. ఇద్దరూ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. అదనుకోసం ఎదురు చూస్తున్నారు.మాణిక్యం ఠాగూర్‌ తెలంగాణకు కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌గా వచ్చినప్పటి నుంచి తనదైన మార్కు చూపిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు అంటే సొంత పార్టీ నేతలే హడలిపోతారు. అలాంటి వీహెఛ్ ,ఇంచార్జ్ ఠాగూర్ మధ్య చాలారోజులుగా వార్ నడుస్తుంది. ఒక సందర్భంలో హన్మంతరావుపై వేటు వేసేవరకు సమస్యలు వెళ్లాయి. ప్రస్తుతం ఇద్దరు నాయకులు సైలెంట్‌గా ఉన్నా తెరవెనక మాత్రం గట్టి వయలెన్స్ నడుస్తుందట…

ఠాగూర్‌ ఇంఛార్జ్‌గా వచ్చిన కొత్తలో గాంధీభవన్‌లో కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఆ తర్వాత దుబ్బాక ఎన్నికలపై మీటింగ్‌ జరుగుతుంటే.. హన్మంతరావు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు అడ్డుకున్నారు. మీకు సమావేశానికి ఆహ్వానం లేదని చెప్పారు. దీంతో నేను వీహెచ్ ను, రాష్ట్ర నాయకుడిని నన్ను పిలిచేది ఏంది? అని రుసరుసలాడారు. అక్కడే ఉన్న ఇంఛార్జ్‌ ఠాగూర్‌ కల్పించుకుని.. హన్మంతరావు.. మీరు గౌరవంగా ఉండాలి. మీరు గాంధీ ఫ్యామిలీకి దగ్గర అని తెలుసు.. మమ్మల్ని కూడా గాంధీ ఫ్యామిలీనే పంపింది? అని కాస్త హెచ్చరిక స్వరంతోనే చెప్పారట. దానికి నేను బీసీ లీడర్‌ను అని వీహెచ్ గద్దించడంతో.. నేనూ బీసీ నాయకుడినే అని ఠాగూర్‌ బదులిచ్చారట. అప్పటి నుంచి ఒకరికొకరు అదును కోసం చూసుకుంటున్నారట.

ఆ మధ్య పార్టీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. పార్టీ డబ్బుల లెక్కలు చెప్పాలంటూ గూడూరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వీహెచ్.ఈ విషయంలో హన్మంతరావు తీరును ఠాగూర్‌ తప్పుపట్టారట. ఫిర్యాదు చేయడానికి నీకేం పని అని వీహెచ్ ను నిలదీశారట. ఈ ఘటనతో ఇద్దరి మధ్య వ్యవహారం మరింత జఠిలంగా మారినట్టు తెలుస్తోంది. ఈ పంచాయితీ కంటిన్యూ అవుతున్న సమయంలోనే ఠాగూర్‌ ప్యాకేజీ తీసుకున్నారు అని వీహెచ్ ఆరోపించడంతో సమస్య మరింత రాజుకుంది.

ఈ ఆరోపణల గురించి తెలుసుకున్న ఇంఛార్జ్ సీరియస్‌ అయ్యారట. ఏం జరిగిందో.. ఏ సందర్భంలో వీహెచ్ ఆ కామెంట్స్‌ చేశారో నివేదిక ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి బోస్‌ రాజును ఆదేశించారు ఠాగూర్‌. క్రమశిక్షణ కమిటీ కూడా నివేదిక పంపింది. దాంతో హన్మంతరావుపై వేటు వేసేవరకు వ్యవహారం వెళ్లిందట. కానీ.. సామాజిక సమీకరణాలు.. గతంలో జరిగిన సంఘటనలను పరిగణనలోకి తీసుకుని వెనక్కి తగ్గారట. ఇప్పుడు చర్యల తీసుకుంటే సమస్య మరో మలుపు తిరుగుతుందని అంతా భావించారాట. కొందరు సీనియర్ నేతలు రంగంలోకి దిగి ఠాగూర్‌కు నచ్చజెప్పినట్టు తెలుస్తుంది. ఆపై వీహెచ్ కూడా వివరణ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.

కానీ.. ఇద్దరి మధ్య వైరం కంటిన్యూ అవుతోందట. ఎక్కడ దొరుకుతారా అని ఒకరికొకరు సమయం కోసం ఎదురు చూస్తున్నారట. కాంగ్రెస్‌లో ఏదైనా సాధ్యమే. మరి.. ఈ పంచాయితీ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news