తైవాన్ కీలక రక్షణ అధికారి మృతి… దండయాత్ర కోసం చైనా ప్రాక్టీస్!

-

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటనతో తైవాన్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పెలోసీ పర్యటనకు ప్రతీకారంగా ఆ ద్వీప దేశం చుట్టూ చైనా చేపట్టిన భారీ సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తైవాన్‌ రక్షణ రంగానికి చెందిన ఓ కీలక అధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

తైవాన్‌ రక్షణశాఖకు చెందిన రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్‌ డిప్యూటీ హెడ్‌ ఒయు యాంగ్‌ లి-హిసింగ్ అనుమానాస్పద రీతిలో కన్నుమూశారు. దక్షిణ తైవాన్‌లోని ఓ హోటల్‌లో శనివారం ఉదయం ఆయన విగతజీవిగా కన్పించారు. ఆయన మృతికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. యాంగ్‌ తైవాన్‌ క్షిపణి అభివృద్ధి బృందానికి నేతృత్వం వహిస్తున్నారు.

మరోవైపు, చైనా సైనిక విన్యాసాలపై తైవాన్‌ తీవ్రంగా స్పందించింది. తమ ప్రధాన భూభాగంపై దాడికి డ్రాగన్‌ సన్నాహాలు చేస్తోందని ఆరోపించింది. తైవాన్‌ జలసంధిలో చైనాకు చెందిన యుద్ధ విమానాలు, నౌకలు భారీ సంఖ్యలో మోహరించి సైనిక విన్యాసాలు చేస్తున్నాయని, కొన్ని చోట్ల నియంత్రణ రేఖను దాటి ఈ నౌకలు తమ జలాల్లో ప్రవేశించాయని తైవాన్‌ రక్షణశాఖ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇవన్నీ చూస్తుంటే డ్రాగన్‌ తమ భూభాగంపై దాడి చేయడం కోసమే ఈ సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతోందని పేర్కొంది. విన్యాసాల్లో భాగంగా చైనా క్షిపణులు కొన్ని తైవాన్‌ మీదుగా ప్రయాణించినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అదే నిజమైతే తైవాన్‌ సౌర్వభౌమత్వాన్ని డ్రాగన్‌ ఉల్లంఘించినట్లే.

ఆసియా పర్యటనలో ఉన్న నాన్సీ పెలోసీ గత మంళవారం తైవాన్‌ రాజధాని తైపేలో పర్యటించింది. అయితే తైవాన్‌ తమ భూభాగమే అని చెబుతున్న డ్రాగన్.. ఈ పర్యటనను తీవ్రంగా పరిగణించి ప్రతీకార చర్యలకు పూనుకుంది. తైవాన్‌పై ఆర్థికపరమైన ఆంక్షలు విధించడమే గాక, గత గురువారం నుంచి ద్వీప దేశం చుట్టూ భారీ విన్యాసాలు ప్రారంభించింది. అంతేగాక, చైనా, కొరియా ద్వీపకల్పం మధ్య ఉన్న యెల్లో సముద్రంలో శనివారం నుంచి ఆగస్టు 15 వరకు లైవ్‌ ఫైర్‌ డ్రిల్‌ చేపట్టనున్నట్లు బీజింగ్‌ తాజాగా ప్రకటించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news