చిన్నపాటి వర్షం పడితే చాలు హైదరాబాద్‌లోని రోడ్లన్నీ జలమయమవుతుంటాయి. అయితే వరద నీరు పొటెత్తితే బస్తీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఎస్న్డీపీతో నాలాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శనివారం సికింద్రాబాద్ లోని ప్యాట్నీ నాలాపై 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి తలసాని, ఎమ్మెల్యే సాయన్న, పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు.
త్వరగా పనులు పూర్తి చేయాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. వాహనదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోని నాలాలను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మంత్రి అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో నగరంలోని నాలాల అభివృద్ధి పనులు చేపట్టి హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దితున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు.