వర్షాలతో తమిళనాడు అతలాకుతలం.. చెన్నైని ముంచెత్తిన వానలు

కుండపోత వర్షాలతో చెన్నై నగరంతో పాటు తమిళ నాడు తీర ప్రాంత జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, అనుకున్నదాని కన్నా ముందుగానే ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై లోని తోలట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్న ముఖ్యమంత్రి స్టాలిన్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. చెన్నై కి వచ్చే వారు తమ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సీఎం స్టాలిన్ కోరారు. మరోవైపు బాధితుల కోసం 50 వేల ఆహర పొట్లాలను సిద్దం చేశారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 7 వరకు రికార్డ్ స్థాయిలో 44 శాతం అధిక వర్షపాతంతో 334 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. మరో నాలుగు రోజుల పాటు చెన్నై, తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. 

మరోవైపు చెన్నైతో పాటు కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు. వీటితో పాటు తీర ప్రాంత జిల్లాల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోయంబత్తూర్, తిరునల్వేలి, తిరువారూర్, విల్లుపురం, ఈరోడ్, కరూర్, కడలూరు, పుదుకోట్టై, పెరంబలూరులో సాధారణ వర్షపాతం కంటే 60 శాతానికి పైగా నమోదైంది.