తాండూరులో మళ్లీ మొదటికొచ్చిన ఎమ్మెల్యే వర్సెస్‌ ఎమ్మెల్సీ వార్ !

-

వికారాబాద్ జిల్లా అధికార పార్టీలో కుమ్ములాటలు మరోసారి తారాస్థాయికి చేరాయి. తాండూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిలు కలిసే ఉన్నట్టు నిన్నటి వరకు కనిపించినా ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి.ఒకప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్నా.. మధ్యలో అవన్నీ సమసిపోయాయన్న వాతావరణం కల్పించారు. కానీ మున్సిపల్‌ కౌన్సిల్‌ వేదికగా ఇక్కడి సమస్య మళ్లీ మొదటికొచ్చిందనే చర్చ జోరందుకుంది.

మున్సిపల్‌ కౌన్సిల్‌ వేదికగా జరిగిన పరిణామాలపై రోహిత్‌ రెడ్డి, మహేందర్‌రెడ్డిలు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. ఏం జరిగిందో రోహిత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు ఫోన్‌లో వివరిస్తే.. మహేందర్‌రెడ్డి మాత్రం స్వయంగా వెళ్లి చెప్పారట. పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై సిద్ధం చేసిన అజెండాలపై ఇద్దరు నేతల మధ్య గొడవ.. దాడికి దారితీసింది. ఈ ఘర్షణ టీఆర్‌ఎస్‌కు నష్టం వాటిల్లేటట్టుగా ఉందని పార్టీ పెద్దలు భావించినట్టు సమాచారం. ఇందుకే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ వివరణలతోపాటు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారట.

మహేందర్‌రెడ్డి గతంలో మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో టీఆర్‌ఎస్‌ ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తాండూరులో జోక్యం చేసుకోవడంపై అభ్యంతరాలు తెలియజేశారు. ఇప్పుడు అదే మహేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ హోదాలో పదేపదే తాండూరులో సమావేశాలు ఏర్పాటు చేయడం తనకు ఇబ్బందిగా ఉందని ఈ దఫా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పార్టీ పెద్దల దగ్గర వాపోయారట. దూకుడు తగ్గించేలా పట్నానికి బ్రేక్‌లు వేయాలని కోరారట. ఆ మేరకు పార్టీ పెద్దలు పట్నంకు సర్ది చెప్పారట. అయినా జడ్పీ చైర్‌పర్సన్‌ హోదాలో మహేందర్‌రెడ్డి భార్య సునీత తాండూరులో పర్యటించడం రోహిత్‌రెడ్డికి రుచించడం లేదని సమాచారం.

తాజా వివాదంపై తాండూరు మున్సిపల్‌ కౌన్సిలర్లు సైతం ఆగ్రహంతో ఉన్నారట. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వ్యవహార శైలిపై మండిపడుతున్నారట. మున్సిపాలిటీలో జరిగిన దాడి తర్వాత కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశమై.. వికారాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏం బాగోలేదని.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వైఖరి వల్ల అంతా ఇబ్బంది పడుతున్నామని ఒకరికొకరు తమ కష్టాలు చెప్పుకొన్నారట. ప్రస్తుతం పార్టీ పెద్దలు తాండూరు అంశాన్ని సీరియస్‌గానే తీసుకున్నట్టు తెలుస్తోంది. క్షేత్ర స్థాయి నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. ఇక్కడి ఆధిపత్య పోరుకు పార్టీ పెద్దలు ఎలాంటి విరుగుడు మంత్రం వేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news