ఇటీవల జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం ఘోరంగా దెబ్బతింది. అనుభవం ఉన్న నాయకుడని భావించి పగ్గాలు అప్పగిస్తే అవినీతి, లంచగొండితనం, తమ్ముళ్ల చేతివాటం పెరిగిపోవడం, కేంద్రంతోను, పక్కరాష్ట్రాల తోనూ ఘర్షణకు దిగడం వంటివి టీడీపీని మరింత పలుచన చేశాయి. ఈ నేపథ్యంలో ఓటమి నుంచి ఇంకా టీడీపీ బయటకు రాలేదు. ఇదే విషయంపై ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ.. ఓటమికి గల కారణాలు ఇంకా అంతుచిక్కడం లేదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు నెలల తర్వాత కూడా ఆయన ఇలా అన్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలావుంటే, అన్ని పార్టీలకూ గుండెకాయ వంటి రాజధాని ప్రాంతం గుంటూరులో ఎన్నికల వరకు బాగానే ఉన్న టీడీపీకి ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే.. గుంటూరు టీడీపీలో ఇప్పుడు ముసలం ఏర్పడింది. ఎక్కడికక్కడ తమ్ముళ్లు కొట్టుకు చస్తున్నారు. దీనికిఅనేక కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే.. గురజాలలో వరుస విజయాలు సొంతం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు గనుల కుంభకోణం మెడకు చుట్టుకుంది. దీంతో ఆయనపై కేసులు నమోదు చేయాలని సాక్షాత్తు హైకోర్టే ఆదేశించింది. మరి దీనిపై అధిష్టానం జోక్యం చేసుకుంటుందని, తనకు ఉపశమనం కలిగిస్తుందని ఆయన అనుకున్నా.. ఇప్పటి వరకు ఇతర నాయకులు కానీ, అధినేత చంద్రబాబు కానీ స్పందించలేదు. మరోపక్క, మాజీస్పీకర్ ఓడిపోయిన సత్తెనపల్లిలో ఆయన నాయకత్వంపై తమ్ముళ్లు తిరుగుబాటు జెండా ఎగరేసేందుకు రెడీ అయ్యారు.
ముఖ్యంగా కోడెల శివప్రసాద్ కుటుంబం అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆయన కుమారుడు, కుమార్తెపై కూడా కేసులు నమోదయ్యాయి. దీంతో కేడర్ అస్సలు కలిసి రావడం లేదు. ఆయనను పంపించేయాలనే డిమాండ్లు జోరుగానే వినిపిస్తున్నాయి. ఇక, బాపట్లలో నిన్న మొన్నటి వరకు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న అన్నం సతీష్ ప్రభాకర్ తాజా ఎన్నికల్లో ఓటమి పాలైన నేపథ్యంలో ఆయన బీజేపీ లోకి చేరిపోయారు. దీంతో ఇక్కడ పార్టీని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వేగేశ్న నరేంద్రవర్మ ఇక్కడ కీలకంగా ఉన్నప్పటికీ.. ఆయనను కేడర్ పెద్దగా పట్టించుకోక పోవడంతో ఆయన కూడా మౌనం వహించారు.
అదే సమయంలో మాచర్లలో ఎంతో నమ్మకంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన అన్నపరెడ్డి అంజిరెడ్డి ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో ఇక్కడ పార్టీని పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఇక, ప్రత్తిపాడులో మరో రకమైన కుమ్ములాట తెరమీదికి వస్తోంది. ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన డొక్కా మాణిక్య వరప్రసాద్ వర్గానికి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వర్గానికి అస్సలు పొసగడం లేదు. దీంతో డొక్కాను అక్కడి నుంచి తప్పించాలని గల్లా వర్గం పట్టుబడుతోంది. దీంతో ఇప్పుడు ఎవరిని శాంతింప జేయాలో అర్ధం కాక చంద్రబాబు తలపట్టుకున్నారు.
మరోపక్క, తాడికొండలో వద్దన్నా టికెట్ ఇచ్చారంటూ.. శ్రావణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం నిప్పులు చెరుగుతోంది. దీంతో ఇక్కడ కూడా పార్టీ పరిస్థితి గందరగోళంలో పడిపోయింది. మొత్తంగా రాజధాని జిల్లా అయిన గుంటూరులో కీలక నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందనేదివాస్తవం. మరి బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.