తిరుపతి బరిలో టీడీపీ..సొంత జిల్లాలో పోటీకి సై అంటున్న చంద్రబాబు…!

-

సిట్టింగ్‌ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మరణంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతుంది. ఎన్నికల సంఘం ఇంకా ప్రక్రియ ప్రారంభించకపోయినా.. పార్టీలు మాత్రం క్రమంగా బై ఎలక్షన్‌పై ఫోకస్‌ పెడుతున్నాయి. తొలుత ఉప ఎన్నికల్లో పోటీకి ఆసక్తి కనబర్చలేదు టీడీపీ. కానీ తిరుపతి పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరైన సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పార్టీ పోటీ చేస్తుందన్న కామెంట్స్ ఇప్పుడు చిత్తూరు జిల్లా పాలిటిక్స్ ని ఒక్కసారిగా హీటెక్కించాయి.

ఆకాల మరణం చెందిన బల్లి దుర్గాప్రసాద్‌ సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి లాస్ట్‌ మినిట్‌లో తిరుపతి ఎంపీగా పోటీ చేశారు. దివంగత నేత కుటుంబసభ్యులు సీఎం జగన్‌ను కలిసి వచ్చారు. మరి.. ఉప ఎన్నికల్లో దుర్గాప్రసాద్‌ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు బరిలో ఉంటారో లేక వైసీపీ నుంచి కొత్త నేత ఎవరైనా తెరపైకి వస్తారో చూడాలి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల బరిలో ఉంటామని ముందుగా ప్రకటించిన పార్టీ బీజేపీ. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు పేరు ఆ పార్టీలో ప్రముఖంగా వినిపిస్తోంది. మరికొందరు బీజేపీ నాయకులు కూడా పోటీకి సై అంటున్నారు. కాకపోతే తిరుపతి లోక్‌సభ పరిధిలోని బీజేపీలో ఆధిపత్య పోరు ఎక్కువనే ఉంది.

తిరుపతి లోక్‌సభ పరిధిలో నెల్లూరు జిల్లాకు చెందిన సూళ్లూరుపేట, సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాకు చెందిన సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్స్‌ ఉన్నాయి. పైగా చంద్రబాబు సొంత జిల్లాలో జరగబోయే ఉప ఎన్నిక. గతంలో వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నా.. సొంత జిల్లాలో జరిగే ఉప ఎన్నికలో పోటీ చేయకపోతే రాంగ్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు అవుతుందని అభిప్రాయపడుతున్నారట. కాంగ్రెస్‌ పార్టీ నుంచి చింతా మోహన్‌ ఉప ఎన్నికల్లో పోటీకి ఆసక్తితో ఉన్నారట. అటు బీజేపీ ఇటు టీడీపీ .. ఇంకోవైపు కాంగ్రెస్‌ బరిలో ఉంటే.. విపక్ష ఓటు చీలి అల్టిమేట్‌గా అధికార పార్టీకి మరోసారి బంపర్‌ మెజారిటీ ఖాయమనే లెక్కలు వేసుకుంటున్నారట వైసీపీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news