ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో ఇప్పుడు టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం మారిన దగ్గరి నుంచి చంద్రబాబు ని రాష్ట్ర ప్రభుత్వం భద్రత విషయంలో ఇబ్బంది పెడుతూ వస్తుంది. ఊహించని విధంగా ఆయనకు భద్రతను పలు మార్లు తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు భద్రత విషయంలో రెండు మాటలు మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది.
ఆయనకు ప్రస్తుతం 180 మందితో భద్రత కల్పిస్తుండగా రాష్ట్ర నిఘా విభాగం మాత్రం అంత భద్రత చంద్రబాబుకి అవసరం లేదని, తగ్గించాలి అంటూ మాట్లాడింది. చంద్రబాబు సహాయకుడికి ఈ మేరకు ఒక లేఖ కూడా రాసింది నిఘా విభాగం. కుదించిన సిబ్బంది పేర్లను ప్రస్తావిస్తూ నిఘా విభాగం ఐజి ఒక లేఖ రాసారు. దీనిపై టీడీపీ నేతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. విమర్శలు వచ్చిన నేపధ్యంలో,
డీజీపీ గౌతం సవాంగ్ కీలక ప్రకటన చేసారు. ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాల్లో చంద్రబాబుకి 180 మంది తో భద్రతను కల్పిస్తున్నామని చెప్పారు. ఇలా రెండు ప్రకటనలు చేయడంతో సర్వత్రా ఉత్కంట నెలకొంది, 2003 లో చంద్రబాబు మీద మావోలు దాడి చేసిన నేపధ్యంలో భద్రతను పెంచారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం బ్లాక్ కమాండో లతో భద్రత కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
దక్షిణాది లో ఈ భద్రత ఉన్న నేత చంద్రబాబు ఒక్కరే. ఇక ఇదిలా ఉంటే టీడీపీ నేతలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతలను తగ్గించింది. మాజీ మంత్రులు టీడీపీ నేతలు కొందరికి భద్రతను తొలగించింది. అదే విధంగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కి కూడా భద్రతను తొలగించారు. ఈ నేపధ్యంలోనే అసలు ఎం జరుగుతుంది అంటూ టీడీపీ కీలక నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.