ఎంపీ గోరంట్ల వీడియో ఫేక్ కాదు : టీడీపీ

-

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఆ వీడియో ఫేక్ అని ఇప్పటికే పోలీసు అధికారులు స్పష్టం చేశారు. అయినా టీడీపీ నేతలు మాత్రం అది నకిలీ కాదని రుజువు చేయడంలో బిజీ అయ్యారు. తాజాగా ఈ వీడియో వ్యవహారంపై టీడీపీ నేతలు స్పందించారు. ఈ వీడియో నకిలీ కాదని.. అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్ధారించినట్లు టీడీపీ నాయకులు వెల్లడించారు. ఈమేరకు పార్టీ తరఫున వీడియోను ప్రైవేటుగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. ఆ వీడియోలో మార్ఫింగ్‌ జరగలేదని ల్యాబ్‌ నిపుణుడు జిమ్‌ స్టాఫ్‌ వార్డ్‌ నివేదిక ఇచ్చినట్లు వెల్లడించారు. ల్యాబ్‌ ఇచ్చిన నివేదికను పార్టీ నేతలు కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, వంగలపూడి అనిత బహిర్గతం చేశారు.

‘‘గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియోను ఆగస్టు 9న ఫోరెన్సిక్‌కు పంపించాం. ఆగస్టు 10న ఆయనను మీడియా ముందుకు ప్రవేశపెట్టి వీడియోలో ఏమీ లేదని కవరప్ చేసే ప్రయత్నం చేశారు. గతంలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌ విషయంలో సీఎం జగన్‌ ఏ రకంగా చర్యలు తీసుకున్నారో అందరం చూశాం. గోరంట్ల మాధవ్‌ విషయంలోనూ నిస్సిగ్గుగా వెనకేసుకొస్తారని ఊహించే అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్‌కు ఆ వీడియోను పంపించాం’’ అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ తెలిపారు.

వీడియోలో మార్ఫింగ్‌ జరగలేదనటానికి సీఎం జగన్‌కి ఈ ఆధారాలు చాలా? ఇంకేమైనా కావాలా?అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర మహిళలకు ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. ఎంపీ పదవిలో కొనసాగే అర్హత మాధవ్‌ కోల్పోయారని విమర్శించారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో ఫోరెన్సిక్‌కి పంపినా ఉపయోగం లేదని ప్రభుత్వం చెప్పటం పచ్చి అబద్ధమన్నారు. ఎంపీపై చర్యలు తీసుకోకపోగా ఎంపీని వెనకేసుకొస్తే ఇక రాష్ట్రంలో మహిళలు ఎలా ధైర్యంగా తిరగగలరని ప్రశ్నించారు. ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసే అర్హత మాధవ్‌కు లేదన్నారు. తాము బయటపెట్టిన ఫోరెన్సిక్‌ నివేదికపై చర్చించే ధైర్యం ప్రభుత్వంలో ఎవరికైనా ఉందా? అని సవాల్‌ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news