ఎంతైనా టీడీపీ రాజకీయాలు చాలా డిఫరెంట్ గురూ! అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా విషయంపై విమర్శలు వస్తే.. వారికి అను కూలంగా సమర్ధించుకోవాలన్నా.. ప్రతిపక్షంలో ఉన్నసమయంలో ఏ విషయాన్ని రాజకీయం చేయాలన్నా.. విమర్శలు గుప్పిం చాలన్నా.. టీడీపీ నేతల శైలే వేరని అంటున్నారు పరిశీలకులు. తాజాగా లాక్‌డౌన్ తర్వాత పరిస్థితులను విశ్లేషిస్తూ.. టీడీపీ నేత లు చేస్తున్న విమర్శలను పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు కూడా టీడీపీ తమ్ముళ్ల తెలివి తేటలకు అచ్చరు వొందుతున్నా రంటే ఆశ్చర్యం అనిపించకమానదు. విషయంలోకి వెళ్తే.. లాక్‌డౌన్ మూడో దశ మొదలైంది. అయితే, కేంద్ర ప్రభుత్వమే కొన్ని విషయాల్లో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ముఖ్యంగా లాక్‌డౌన్ ఎఫెక్ట్ తో రాష్ట్రాలు ఆర్ధికంగా నష్టపోయాయి.
ఈ నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. అయితే, ఈ విషయంపై మౌనంగా ఉన్న కేంద్రం .. ఏరాష్ట్రం డబ్బులు అడి గినా.. సమాధానం మాత్రం చెప్పడం లేదు. అంతేకాదు, రాష్ట్రాలు ఇంకా తమను ఎక్కడ డబ్బుల కోసం పీడిస్తాయో.. అనుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. బాగా ఆలోచించి మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వెంటనే బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా చాలా రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కానీ, ప్రధాని మోడీ ఉన్న ఢిల్లీలోనే అక్కడి సీఎం కేజ్రీవాల్ లిక్కర్ ధరలను 70 శాతం పెంచారు. ఈయన చంద్రబాబుకు కూడా స్నేహితుడే. అదేసమయంలో యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా 75 శాతం ధరలు పెంచారు.
మొత్తానికి ఆయా రాష్ట్రాల వ్యూహం ప్రజలతో మద్యం మాన్పించడం కాదు.. వారితో బాగా కొనిపించి.. కరొనా కష్టంలో చేసిన ఖర్చును పూడ్చుకోవడమే! ఇక, ఇదే దారిలో ఏపీలో కూడా సీఎం జగన్ మద్యం ధరలను 75 శాతం పెంచారు. నిన్న పాతిక శాతం, ఈ రోజు యాభై శాతం మొత్తం 75 శాతం పెంచారు. దీనికి ప్రభుత్వం చెప్పిన మాటేంటే. ధరలు పెంచితే.. కొనేవారు తగ్గుతారని! నిజానికి చాలా జిల్లాల్లో మంగళవారం ఇదే దృశ్యం కనిపించింది. నిన్న మందు అమ్మకాలు ప్రారంభించిన సమయంలో భారీ ఎత్తున కిలో మీటర్ల కొద్దీ లైన్ పెట్టిన మద్యం ప్రియులు మంగళవారం ధరలు పెంచడంతో మాయమై.. ఇంటికే పరిమితమయ్యారు. దీంతో మద్య నిషేధంలో ఆదినుంచి జగన్ చెప్పిన విషయం అమల్లోకి వచ్చినట్టయింది.
కానీ, ఈ సమయంలోనే టీడీపీ తమ్ముళ్ల బుద్ధికి చక్కటి ఆలోచన వచ్చింది. మద్యం ధరల పెంపును రాజకీయం చేయడంలో కొత్త కోణం కోసం వెతికారు. వెంటనే వారికి అమ్మ ఒడి గుర్తుకు వచ్చింది.(రైతు భరోసా ఎందుకు గుర్తుకు రాలేదో వారే చెప్పాలి) అమ్మ ఒడి పథకంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలకు తమ పిల్లలను పంపించే తల్లులకు ఏటా రూ.15000 ఇస్తోంది. అయితే, ఆ డబ్బును ఇలా మద్యం ధరలు పెంచి కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగేసుకుంటూ.. మరో 7000 జగన్ అదనంగా తీసుకుని ఖజానా నింపుకొంటున్నారనేది తమ్ముళ్లు మోకాలుకు వేసిన అద్భుతమైన ముడి!!
అమ్మ ఒడి vs నాన్నగొంతుతడి
క్వార్టర్ మీద 60/-పెంచాడు
నాన్న రోజుకో క్వాటర్ వేస్తే
నెలకు1800
సంవత్సరానికి 1800×12=21600
అమ్మ ఒడి-15000
నాన్న దగ్గర లాగేది-21600
ఎటొచ్చి అన్నకే 7000లాభం వడ్డితో సహా అంటూ.. తమ్ముళ్లు సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. అయితే, ఇక్కడ ధర్మ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్లు చెప్పినలెక్క ప్రకారం చూసినా.. ప్రతిరోజూ క్వార్టర్ వేసేవారు తక్కువగానే ఉంటారు. అంతేకాదు. అమ్మ ఒడి తీసుకుంటున్న కుటుంబాలన్నీ కూడా మద్యానికి బానిసయ్యాయా? అనేది తమ్ముళ్లు తేల్చాలి. ఏదైనా విమర్శ చేస్తే.. గోడకు రంగేసినట్టు ఉండాలి. కానీ, ఇలా తమ్ముళ్లు పసలేని విమర్శలు చేస్తే.. ఎలా అనేది ప్రధాన ప్రశ్న. ఏమంటారు తమ్ముళ్లూ?!