అమరావతిః “ఆంధ్రప్రదేశ్ ను బీహార్ లా మార్చేశాడు వైఎస్ జగన్. నాడు-నేడు స్కీంలో భాగంగా నాడు పచ్చనిసీమగా ఉన్న ప్రాంతాన్ని నేడు ఫ్యాక్షన్ సీమగా చేశారు. గన్ రాకముందే జగన్ వస్తాడని గాలి కబుర్లు చెప్పారు. ఇప్పుడు రివర్స్ లో జగన్ రెడ్డి కంటే ముందు ఆయన పెంచిపోషిస్తోన్న ఇసుక మాఫియా గన్‌లతో వచ్చింది”అంటూ వైకాపా ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజకీయాలకు అదుపులేకుండా పోతున్నదన్నారు. జగన్ కేంటే ముందుగానే ఇసుక మాఫియా గన్‌లతో వచ్చి తూర్పుగోదావరి జిల్లా, లంకల గన్నవరంలో రెచ్చిపోయిందంటూ ట్వీట్ చేశారు. అలాగే, భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు, ఇసుకని బంగారం చేశారు, ఇప్పుడు గన్నులు పట్టుకొని ప్రజలపై పడ్డారు వైకాపా ఇసుకాసురులు. స్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు, ప్రజల ప్రాణాలు తీస్తారు’ అని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించి రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు సబంధించి.. గన్నులు, కర్రలతో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వీడియోను సమాజిక మాధ్యమాలలో షేర్ చేశారు.