గ‌న్న‌వ‌రం టీడీపీ కొత్త ర‌థ‌సార‌థి ఎవ‌రు..!

-

ఆలు లేదు చూలు లేదు… కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా మారింది గన్నవరం టిడిపి నేతల పరిస్థితి. ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసలు పార్టీలో ఉంటారా ? వెళ్ళిపోతారా లేదా వైసీపీలోకి వెళ్లి ఆ పార్టీ నుంచి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ? అసలు వంశీ ఏం చేస్తారు అన్నది ఎవరికీ క్లారిటీ లేదు. ఇంకా చెప్పాలంటే వంశీ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఆయ‌న్ను బుజ్జగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానితో పాటు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను రంగంలోకి దించారు.

ఇదిలా ఉంటే వంశీ తమ పార్టీలో ఉంటారన్న నమ్మకం లేని గన్నవరం టిడిపి నేతలు తమ భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటికే సమాలోచనలు జరుపుతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ నేతలు అందరూ గన్నవరం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో సమావేశమై వంశీ వెళ్ళిపోతే ఏం చేయాలి ? అనే అంశంపై చర్చించుకున్నారు. ఇదిలా ఉంటే వంశీ వైసీపీలోకి వెళ్లి… ఒక వేళ ఆ పార్టీ నుంచి పోటీ చేసిన పక్షంలో ఉప ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎవరు ? పోటీ చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది.

జిల్లా పార్టీలో మెజార్టీ వర్గాలు మాత్రం మాజీ మంత్రి దేవినేని ఉమా అయితే అక్కడ వంశీని గట్టిగా ఢీ కొడతారని… ఆయన అయితేనే సరైన అభ్యర్థి అవుతారని చెబుతున్నారు. అయితే నియోజకవర్గానికి చెందిన కొందరు కీలక నేతలు మాత్రం ఉమాపై ప్రత్యర్థి పార్టీలు స్థానికేతరుడు అన్న ముద్ర వేస్తాయని…అదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గ‌ద్దె అనురాధ అయితే ఇక్కడ సరైన అభ్యర్థి అవుతారని సూచిస్తున్నాయి.

మరోవైపు గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ సైతం గుడివాడ రాజకీయాల్లో కంటిన్యూ అయ్యేందుకు ఇష్టపడటం లేదు. అవినాష్ కొద్దిరోజులుగా పెనమలూరు లేదా విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం తనకు ఇవ్వాలని పట్టుబడుతున్నాడు. ఈ క్రమంలోనే అవినాష్‌కు గన్నవరం కేటాయించినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది.
గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలో కూడా విస్తరించి ఉంది. ఇంకా చెప్పాలంటే అవినాష్ ఇంటికి అతిసమీపంలో ఉన్న రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి గన్నవరం పరిధి ప్రారంభమవుతుంది.

ఈ క్రమంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో కూడిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సైతం తనకు ఛాన్స్ ఇస్తే పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు చెబుతున్నారు. తాను పోటీ చేస్తే నియోజకవర్గంలో ఉన్న కాపు ఓట‌ర్ల‌తో పాటు టీడీపీకి బ‌ల‌మైన క‌మ్మ ఓటింగ్‌ను త‌న‌కు అనుకూలంగా మలుచుకుని సులువుగా విజయం సాధిస్తానన్న‌దే బోండా ఉమా ధీమాగా తెలుస్తోంది. ఏదేమైనా అసలు వంశీ డెసిషన్ ఎలా ? ఉంటుందో… వంశీ రాజీనామా ఆమోదం పొంది గన్నవరంకు ఉప ఎన్నిక వస్తే అప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా మారుతాయో ? టిడిపి ఎలాంటి ఈక్వేషన్ లో ఫాలో అవుతుందో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news