గతమెంతో ఘనం.. వర్తమానం అయోమయం.. భవిష్యత్తు ప్రశ్నార్థకం లా మారిపోయింది ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ పరిస్థితి! ఏమాత్రం క్లారిటీ లేకుండా చేస్తున్న రాజకీయం.. ఏమాత్రం స్పష్టత లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు.. వెరసి చంద్రబాబు అంటే ప్రస్తుత రాజకీయాల్లో ఒక కామెడీ అయిపోయింది!
అవును… టీడీపీ కార్యకర్తల సంగతి కాసేపు పక్కనపెడితే… చంద్రబాబు అభిమానులకు నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం! గత కొంతకాలంగా చంద్రబాబు తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందులో భాగంగా.. దానికి కొనసాగింపుగా తాజాగా మరో నిర్ణయం ప్రకటించారు చంద్రబాబు. అదే… బద్వేల్ ఉప ఎన్నిక పోరు నుంచి తప్పుకుంటున్నట్లు!
అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు నట్టేట్లో ముంచేశాడే గంగరాజు అనే సినిమా పాటస్థాయిలో… వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ప్రకటించిన పవన్ కల్యాణ్, రెండో రోజే.. బద్వేల్ పోరులో ఉండమంటూ తేల్చేశారు. విచిత్రంగా… పవన్ చెప్పిన మరుసటిరోజే.. చంద్రబాబు కూడా మానవత్వం మాటున పలాయనవాదాన్ని నమ్ముకున్నారు!
ఒకవేళ బద్వేల్ ఉప ఎన్నికపై చర్చ మొదలైనప్పుడే.. బాబు ఈ తరహా నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే.. కొద్దో గొప్పో కాస్త లెక్కగా ఉండేది! పోనీ.. ఎన్నిక ఖరారు అయ్యాక అయినా తమ నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే ఎంతో కొంత బెటర్ గా ఉండేది! కానీ… ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అవ్వడం.. టీడీపీ ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించడం జరిగిపోయిన తర్వాత… ఉప ఎన్నిక పోరు నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించారు బాబు!
ఇంతకు మించిన రాజకీయ బేలతనం మరొకటి ఉంటుందా? చేతకానప్పుడు – చేవలేనప్పుడు అభ్యర్థిని ప్రకటించడం ఎందుకు? ఇప్పటికే ఆ అభ్యర్థితో ప్రచారం చేయించడం ఎందుకు? ఇప్పుడు చావుకబురు చల్లగా చెప్పడం ఎందుకు? ఫలితంగా… తన నిర్ణయాలు పవన్ ఆలోచనలకు అనుగుణంగా ఉంటాయే తప్ప… గతంలోలాగా సొంతంగా ఆలోచించే పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పుకుంటున్నారు బాబు!
దీంతో… ఇలాంటి ఆలోచన ఉండి ఉంటే.. పవన్ కంటే ముందే ప్రకటించొచ్చు కదా బాబు గారు? పవన్ ప్రకటించిన తర్వాత ప్రకటించారు.. అంటూ ఫీలైపోతున్నారు తమ్ముళ్లు! ఫలితంతా… ఇంతకాలం టీడీపీకి జనసేన మిత్రపక్షం అనుకునే జనాలు… ఇకపై, జనసేనకు టీడీపీ మిత్రపక్షం అనుకునే పరిస్థితి దాపురించిందనే కామెంట్లు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి!