టీడీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు… బాబు మాట లైట్ తీస్కో…!

-

రాజ‌కీయాల్లో ఎంత ఓర్పు ఉండాలో.. ఎంత సంయ‌మ‌నంతో ముందుకు సాగాలో..తెలిసి కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. దానిని కోల్పోతున్నారా?  కేవ‌లం అమ‌రావ‌తి విష‌యంలో ఆయ‌న చేస్తున్న దూకుడు కార‌ణంగా పార్టీ ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా మార‌నుందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ఇప్పుడు వీరంతా చంద్ర‌బాబు తీసుకునే నిర్ణ‌యాల‌ను చాలా ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. అమ‌రావ‌తిని ప‌ట్టుకుని వేలాడుతున్న‌చంద్ర‌బాబు.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల విష‌యాన్ని ప‌క్క‌న పెట్ట‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీడీపీపై వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

గ‌తంలోనే చంద్ర‌బాబు అనేక విష‌యాల్లో రాజీనామాల‌ను చుల‌క‌న చేసి మాట్లాడారు. రాజీనామాల‌తో ప్ర‌త్యేక హోదా వ‌స్తుందా? ఇదంతా జ‌గ‌న్ స్టంటు! అని వ్యాఖ్యానించిన చంద్ర‌బాబు.. ఇప్పుడు అమ‌రావ‌తి విష‌యంలో మాత్రం రాజీనామాలు చేయాల్సిందేన‌ని జ‌గ‌న్ స‌ర్కారుపై ఒత్తిళ్లు తెస్తున్నారు. దీనికి సంబంధించి న‌ల‌భై ఎనిమిది గంట‌ల డెడ్‌లైన్ విధించారు. ఇక‌, ఈ వాద‌నకు కూడా స‌మ‌యం మించిపోయింది. అయిన‌ప్ప‌టికీ.. వైఎస్సార్ సీపీ నుంచి ఎలాంటి క‌ద‌లికా రాలేదు. అయితే, ఇప్పుడు మీరు చేయ‌న‌క్క‌ర‌లేదు.. మేం చేసేస్తాం.. కానీ, మీరు మాత్రం అమ‌రావ‌తిని ఉంచుతామ‌ని చెప్పండి! అనే మ‌రో వాద‌న‌ను ఎంచుకున్నారు.

ఈ వాద‌న‌ల‌తో చంద్ర‌బాబు త‌న‌ను తాను చుల‌క‌న చేసుకుంటున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఏదో ఒక విష‌యంపై ఆయ‌న‌స్టాండ్ తీసుకుని వ్య‌వ‌హ‌రిస్తే.. ప్ర‌జ‌ల్లో బాబుపై న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంద‌ని, అలా కాకుండా పిల్లి శాపాలు, పిల్లి వాగ్దానాలు చేయ‌డం వ‌ల్ల ఒరిగేది ఏముంటుంద‌ని ప్ర‌శ్నిస్తున్న‌వారు పార్టీలోనే వినిపిస్తున్నాయి. మ‌రోప‌క్క‌, రేపు చంద్ర‌బాబు రాజీనామా చేస్తే.. మిగిలిన వారిలో ఎవ‌రు ఆయ‌న‌తో క‌లిసి వ‌స్తార‌నే వాద‌న ఉంది.

ఇప్ప‌టికే ముగ్గురు ఎమ్మెల్యేలు బాబుకు చాలా దూర‌మై.. జ‌గ‌న్ చాలా ద‌గ్గ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలో బాబుతో క‌లిసి వ‌చ్చే నేత‌లు ఎందరు?  రేపు ఒక‌వేళ ప్ర‌జ‌లు మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో బాబు గెలిచి.. మిగిలిన 23 మందిలో ప‌ది మంది ఓడితే.. ప‌రిస్థితి ఏంటి? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఏదేమైనా ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌నేది సొంత పార్టీ నేత‌లే చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news