విజయనగరం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం బొబ్బిలి. జనరల్ కేటగిరీలో ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ దూకుడు ఎక్కువ. అలాగని టీడీపీకి అసలు ఇక్కడ పట్టు లేదా? అంటే.. ఉంది. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పుట్టిన తర్వాత టీడీపీ గెలుపు గుర్రం ఎక్కని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అయితే, బొబ్బిలో మాత్రం కాంగ్రెస్ హవాను తట్టుకుని మరీ 1983, 1985, 1994 ఎన్నికల్లో విజయం దక్కించుకుంది. అది కూడా అన్నగారు ఎన్టీఆర్ జీవించి ఉన్న సమయంలో కావడం గమనార్హం. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆ మూడు సార్లు కూడా గెలిచింది ఒక్కరే ఆయనే ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శంబంగి వెంకట చిన అప్పల నాయుడు.
ఆ తర్వాత అంటే.. 1994 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు కూడా టీడీపీ బొబ్బిలి నియజకవర్గంలో గెలుపు గుర్రం ఎక్కింది లేదు. అభ్యర్థులు ఎవరైనా కావొచ్చు.. పార్టీ పేరు, ఊరుకూడా ఇక్కడ పనిచేయడం లేదు. అంతకు ముందు.. ఆ తర్వాత అన్నట్టుగా 2014 వరకు కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తూ వచ్చింది. భారీ ఎత్తున ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు.. తర్వాత కాలంలో వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లింది. ఈ క్రమంలో 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుజయ వెంకట కృష్ణరంగారావు విజయం సాదించారు. నిజానికి ఆది నుంచి వైఎస్‌కు అనుకూలంగా ఉన్న ఈ కుటుంబం కాంగ్రె స్ తరఫున టికెట్ సంపాయించుకుని విజయం దక్కించుకుంది.
ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీలోనూ సుజయ్ కృష్ణ.. టికెట్ తెచ్చుకుని విజయం సాధించారు. పార్టీ తరఫున కూడా గట్టి వాయిస్ వినిపించారు. అయితే, తర్వాత కాలంలో మంత్రి పదవిపై ఆశతో ఆయన టీడీపీకి జంప్ అయ్యారు. మంత్రి పదవి అయితే సంపాయించుకున్నారు. కానీ, నియోజకవర్గంలో మాత్రం పేరు సంపాయించుకోక పోగా.. పార్టీ మారి పరువు పోగొట్టుకున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ తరఫున సుజయ్ పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన శంబంగి వెంకట చిన అప్పల నాయుడు విజయం సాధించారు.
మరి ఇప్పుడు ఎన్నికలు పూర్తయి.. ఏడాదిన్నర అయింది. మరి ఈ ఏడాది కాలంలో టీడీపీ పరిస్థితి ఏంటి? అంటే.. ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది తప్ప.. పార్టీని బలోపేతం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. పైగా మంత్రి పదవిని అనుభవించిన సుజయ్ కూడా గడప దాటడం లేదు. దీంతో పార్టీ ఇక్కడ పడుకున్నట్టేనని అంటున్నారు పరిశీలకులు. మరి మున్ముందు ఏమైనా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే.. తప్ప కోలుకోవడం కష్టమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బొబ్బిలి రాజకీయం టీడీపీలో పెడబొబ్బలు పెట్టిస్తోందనేది వాస్తవం.