నేడు హైదరాబాదులో జరిగిన టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ… విభజన సమయంలో సమన్యాయం కోసం పోరాడిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. తన తర్వాత వచ్చిన సీఎంలు కేసీఆర్ సహా అందరూ హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడ్డారని, వారికి అభినందనలు తెలుపుతున్నానని వివరించారు. తెలుగుజాతి మొత్తం గ్లోబల్ సిటిజెన్స్ గా మారారని తెలిపారు. నాడు ఎన్టీఆర్ తెలుగువారి కోసం పార్టీ పెట్టారని, మానవత్వమే తన సిద్ధాంతమని ఎన్టీఆర్ చాటి చెప్పారని వివరించారు. నాడు హైదరాబాద్ ను మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేశామని చంద్రబాబు వెల్లడించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా రాష్ట్రాభివృద్ధి కొనసాగించారని తెలిపారు. అయితే వైఎస్ హైదరాబాద్ మెట్రోను పక్కనబెడితే రోశయ్య గాడిలో పెట్టారని వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు తానే కట్టానని తన మనస్సాక్షికి తెలుసని స్పష్టం చేశారు. పేరు, ఓటు కోసం కాదు… తెలుగుజాతి కోసం నేను పనిచేశా అని ఉద్ఘాటించారు.
ఏపీ రాజధాని కోసం 33 వేల ఎకరాలు రైతులు ఇచ్చారని, హైదరాబాదుకు దీటుగా అమరావతి నిర్మాణం చేపట్టామని తెలిపారు. కృష్ణా-గోదావరి అనుసంధానం ప్రాజెక్టు చేపట్టామని చంద్రబాబు వివరించారు. ఏపీలో విధ్వంసం చేయడానికి జగన్ పుట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రే రాజధానిని సర్వనాశనం చేయడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర విభజన కంటే సైకో సీఎం జగన్ వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. పులివెందులలో తుపాకీ సంస్కృతిపై జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. ఏపీలో గంజాయి, గొడ్డలి కల్చర్ కు జగనే కారణమని తెలిపారు. ఏపీలో జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని, జగన్ పాలనతో అభివృద్ధి 30 ఏళ్ల వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.