నెల్లూరు రూరల్‌ పై ఫోకస్‌ పెట్టిన టీడీపీ సీనియర్ నేత

-

ఏపీలో జిల్లాల విభజన చాలా మంది నేతల తలరాతలు మార్చేలా ఉంది. కొన్ని సామాజికవర్గాలు,బలమైన ఓటు బ్యాంక్ తారుమారు అయ్యే అవకాశం ఉంది. ఇది గమనించిన చాలా మంది సేఫ్‌ గేమ్‌ ఆడేందుకు వీలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ జాబితాలో నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేరినట్లు టీడీపీలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో సోమిరెడ్డి పోటీ చేస్తున్న సర్వేపల్లి.. తిరుపతి లోక్‌సభ పరిధిలో ఉంది. తిరుపతి జిల్లా అయితే.. నెల్లూరు జిల్లాతో సోమిరెడ్డికి సంబంధాలు తెగిపోతాయి. దీంతో కొత్త నియోజకవర్గం పై కన్నేసారట ఈ టీడీపీ సీనియర్ నేత…

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సొంతూరు అల్లాపురం నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టు ఉంది. అందుకే సర్వేపల్లి నుంచి నెల్లూరు రూరల్‌కు మారే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీలో చెవులు కొరుక్కుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌ నుంచి మాజీ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడినా అజీజ్‌ యాక్టివ్‌గానే ఉన్నారు. టీడీపీలో మైనారిటీ నాయకుడిగా ప్రత్యేక ఇమేజ్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలతో రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అయితే మొన్నటి ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి కాకుండా నెల్లూరు రూరల్‌ నుంచి పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని సోమిరెడ్డి శిబిరం భావిస్తోందట. వాస్తవానికి సర్వేపల్లిలో వరుస ఓటములు పలకరించాయి. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేసినా జనాలు ఎందుకు ఓడిస్తున్నారో ఆయనకు ఇప్పటికీ అర్థం కావడం లేదట. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గం మార్చుకుంటే బెటర్‌ అని అనుచరులు సూచిస్తున్నారట.

ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్నందున జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను తీసుకుంటే బాగుంటుందని చెబుతున్నారట. ఇదే విషయాన్ని టీడీపీ అధిష్ఠానం చెవిలో వేశారట సోమిరెడ్డి.. పనిలో పనిగా నియోజకవర్గం మార్పు గురించి కూడా ప్రస్తావించారని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా వచ్చే ఎన్నికల నాటికి తాను నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని, నెల్లూరు రూరల్‌ అసెంబ్లీ టికెట్‌ తన కుమారుడి రాజగోపాల్‌రెడ్డికి కేటాయించాలని ఇప్పటి నుంచే పార్టీ పెద్దలకు చెబుతూ వస్తున్నారట.

అయితే రూరల్‌లో అబ్దుల్‌ అజీజ్‌ అడ్డుపడుతుండటంతో.. ఆయన్ని పిలిచి సోమిరెడ్డి వర్గం మాట్లాడినట్లు టాక్‌. రాష్ట్రస్థాయి పదవి తీసుకుని నెల్లూరు రూరల్‌ వదిలేయాలని కోరారట. ఈ ప్రతిపాదనకు అజీజ్‌ అంగీకరించలేదని సమాచారం. తనకు రూరల్‌ ఇంఛార్జ్‌ పదవి చాలని.. రాష్ట్రస్థాయిలో పార్టీ పదవులు అవసరం లేదని తేల్చి చెప్పారట. అజీజ్‌ ఒప్పుకోకపోతే.. సోమిరెడ్డి ఏం చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. నెల్లూరును వదిలేసుకుంటారా..ఎన్నికలకు ఇంకా టైమ్‌ ఉందని వేచి చూస్తారా అన్నది చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news