ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా రక్కసి మరోసారి కోరలు చాస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి కరోనాపై దృష్టి సారించారు. దీనికి తోడు వర్షాకాలం కావడంతో.. వ్యాధినిరోధక శక్తి దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే.. ఇది కరోనాకు అనుకూలమయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే.. తాజాగా తెలంగాణలో కరోనా వ్యాప్తి ఓ మోస్తరు స్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 24,968 శాంపిల్స్ పరీక్షించగా, 528 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఒక్క హైదరాబాదు జిల్లాలోనే అత్యధికంగా 327 కొత్త కేసులు నమోదయ్యాయి.
రంగారెడ్డి జిల్లాలో 52, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 39 కేసులను గుర్తించారు. అదే సమయంలో 485 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,05,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,96,365 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 5,189 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.