తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో దీని ప్రభావం అధికంగా ఉంది. కాగా, రాష్ట్రంలో శనివారం కొత్తగా 1,087 కరోనా పాజిటివ్ కేసులు, ఆరు మరణాలు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 13,436కు చేరింది. మొత్తం 243 మరణాలు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 4,928 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 8,265 యాక్టివ్ కేసులున్నాయి. అయితే ఇవాళ నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ లోనే 888 నమోదయ్యాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు.