తెలంగాణాలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. దీనితో ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని కెసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నా కొందరు ఉద్యోగులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మెజారిటి ప్రజలు మాత్రం కెసిఆర్ తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారని కొనియాడుతున్నారు.
ఇది పక్కన పెడితే ఇప్పుడు ఉద్యోగుల జీతాల విషయంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసినట్టు తెలుస్తుంది. ఆ జీవో ప్రకారం కోత కాకుండా జీతాల్లో కొంత భాగాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. మిగిలిన కొంత భాగాన్ని ఎప్పుడు ఇస్తారు అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. అయితే ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన తర్వాత వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య సెంచరికి చేరువలో ఉన్న సంగతి తెలిసిందే. నిదానంగా రాష్ట్రంలో కేసులు బయటపడటంతో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్ధిక ఇబ్బందులు మాత్రం రాష్ట్రాన్ని భాగా ఇబ్బంది పెడుతున్న విషయం అర్ధమవుతుంది. రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి పంటలను కొనాలని ప్రభుత్వ౦ నిర్ణయం తీసుకుని నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.