కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు హై అలర్ట్‌ను ప్రకటించిన విషయం విదితమే. ఇక భారత్‌లో అన్ని రాష్ట్రాల్లోనూ ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే తెలంగాణలో కొంత కాలం పాటు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులను రద్దు చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కరోనా నేపథ్యంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తుందని చర్చించుకుంటున్నారు.
కరోనా వైరస్ శ్వాస వ్యవస్థ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందన్న సంగతి తెలిసిందే. అయితే డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తే ఆ వ్యాధి వస్తుందేమోనని వాహనదారులు భయపడుతున్నారట. ఈ క్రమంలోనే సదరు టెస్టులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులను రద్దు చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని, తమకు ఆదేశాలు వస్తే ఆ టెస్టులను రద్దు చేస్తామని ఆయన తెలిపారు.
కాగా మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనా నేపథ్యంలో వాహనదారులు భయభ్రాంతులకు లోనవుతున్నారని, ఈ క్రమంలో ఆ టెస్టులను చేస్తే వారు ఇంకా భయ పడుతారని, అందుకే కరోనా ప్రభావం తగ్గేవరకు ఆ టెస్టులను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల తెలంగాణ ప్రభుత్వం డ్రంకెన్ డ్రైవ్ టెస్టులను రద్దు చేసే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది..!