తెలంగాణ వాకిట కరోనా ఆశించిన స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో గవర్నర్ తమిళ సై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం ఇది.. మన లోకం పాఠకుల కోసం..
ఎక్కడో పుట్టిన కరోనా మన దేశానికి చేరుకుని అంతా అతలాకుతలం చేసిపోయింది. రెండేళ్ల పాటు ఊపిరి తీసుకోకుండా యంత్రాంగం పరుగులు పెడుతూనే ఉంది. వివిధ వేరియంట్లు వాటి లక్షణాలు, వాటిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలుఇవన్నీ కూడా వివరించేందుకు ముందుగా వాటిని అర్థం చేసుకుని అవసరం మేరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్యులకు తల ప్రాణం తోకకు వచ్చింది. వేర్వేరు వేరియంట్లు వేర్వేరు వేవ్ ల పేరుతో రావడంతో వైద్యాలయాలు అన్నీ పేషెంట్లతో కిటకిటలాడాయి. ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్ ను కొంత తట్టుకున్నారు. వైద్యులు కూడా అలానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విస్తృత ప్రచారం చేశారు. అవి ఫలించాయి.
కానీ సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ బెడ్ల కొరత విపరీతంగా ఉంది. కరోనా మొదటి వేవ్ లో రక్త ఫలకికల కొరత ఉంటే, రెండో వేవ్ ఆక్సిజన్ బెడ్ల కొరత వచ్చింది. ఫస్ట్ వేవ్ లో ప్లాస్మా థెరఫీ కొంత మేర ప్రభావం చూపి సత్ఫలితాలు ఇవ్వడంతో రక్తదాన శిబిరాలు ఎక్కడిక్కడ తగు జాగ్రత్తలు తీసుకుని ఏర్పాటుచేశారు. తరువాత మాత్రం ప్లాస్మా థెరఫీపై కూడా గ్యారంటీ ఇవ్వలేం అని నిపుణులు తేల్చేశారు. దాంతో ఎంతో అవసరం అయితేనే ఆ ప్రక్రియను వాడుకున్నారు కూడా ! ఇక రెండే వేవ్ లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత విపరీతంగా నెలకొంది. శ్వాస సంబంధ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది.
దీంతో కృత్రిమ ఆక్సిజన్ అవసరం అయింది. ఐసీయూ బెడ్లకు విపరీతం అయిన డిమాండ్ వచ్చింది. ఆ..గోడు ఆ..గొడవ నుంచి తేరుకునే లోపే మొన్న సంక్రాంతికి ఆల్ఫా బీటా డెల్టా వేరియంట్ల మాదిరిగానే ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించింది. అయితే జ్వరం తీవ్రత కారణంగా మూడు నాలుగు రోజుల పాటు పేషెంట్ ను అతలాకుతలం చేసినా ఆస్పత్రులకు వెళ్లకుండానే డోలో 650, ఎజిత్రో మైసిన్ తో ఒడ్డెక్కిపోయారు.
ఇప్పుడు మారుతున్న వేరియంట్ల ప్రభావం పెద్దగా లేదు. కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ వాకిట గడిచిన 24 గంటల్లో 28 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో గవర్నర్ ఈ వార్త విని ఎంతో ఆనందంతో ఉన్నారు. వైద్యారోగ్య కార్యకర్తల సేవలకు తలొంచి ప్రణామం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటిలానే మాస్కు ధరించడం తప్పనిసరి అని అంటున్నారామె!