రైతు బంధు సమస్యలు : టోల్ ఫ్రీ నంబర్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

-

తెలంగాణ రాష్ట్రంలోని రైతుల‌కు పంట పెట్టుబడి స‌హాయం అందించేందుకు గాను రాష్ట్ర ప్ర‌భుత్వం రైతు బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా మొద‌ట్లో ఎక‌రానికి రూ.4వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతుల బ్యాంకు అకౌంట్ల‌లో జ‌మ చేశారు. అయితే ప్ర‌స్తుతం ఆ స‌హాయాన్ని పెంచారు. ఇప్పుడు రూ.5వేల చొప్పున రైతుల అకౌంట్ల‌లో న‌గ‌దు జ‌మ అవుతోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు సొమ్మును రైతులు విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల క్రింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ విషయమై బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ ఆదేశాల అనుసరించి రాష్ట్ర ఆర్థికశాఖామాత్యులు టి. హరీష్‌రావు , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు బ్యాంకర్లతో మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు. రైతుబంధు నిధులను నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈ సందర్భంగా బ్యాంకర్లు తెలిపారు. భవిష్యత్తులో రైతుబంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయవద్దని గౌరవనీయ ఆర్ధిక మంత్రి బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

నిలిపివేయబడిన / సర్దుబాటు చేయబడిన ఏదైనా మొత్తం ఉన్నట్లయితే తిరిగి రైతుల ఖాతాకు జమ చేయాలన్నారు. ఈ అంశంపై బ్యాంకర్లు తమ తమ బ్యాంకు బ్రాంచీలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ విషయాన్ని జిల్లా స్థాయిలో పర్యవేక్షించుటకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి టీం మానిటరింగ్ చేస్తుంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు 18002001001 మరియు 04033671300 ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఆదే విధంగా పంట రుణాల రెన్యూవల్, పంపిణీని బ్యాంకర్లు వేగవంతం చేయాలని మంత్రి బ్యాంకర్లను ఆదేశించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news