షాపుల్లో, ఇతర ముఖ్యమైన వాణిజ్య ప్రాంతాల్లో దొంగతనాలు జరగకుండా ఉండేందుకు గాను భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇది సహజమే. అయినప్పటికీ అనేక చోట్ల దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఎంతో జీతం చెల్లించి సెక్యూరిటీ గార్డులను నియమించినా వారు రాత్రి నిద్రిస్తే అంతే సంగతులు. దొంగతనం జరిగితే ఇబ్బందులు తప్పవు. అయితే ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆ కంపెనీ ఓ వినూత్న ఐడియా ఆలోచించింది. అదేమిటంటే..
ఒక షాపులో అమర్చిన సీసీటీవీ కెమెరాలకు చెందిన ఫీడ్‌ను దూరంగా ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి నిరంతరం పర్యవేక్షిస్తుంటాడు. ఆ షాపులో ఎవరైనా దొంగలు పడితే వెంటనే అతను బిగ్గరగా అరుస్తాడు. ఆ నెట్‌వర్క్ అంతా కనెక్ట్ అయి ఉంటుంది కనుక అతను అరవగానే ఆటోమేటిగ్గా ఆ అరుపులు సదరు షాపులో వినబడతాయి. దీంతో దొంగలు అక్కడి నుంచి పారిపోతారు. అవును.. దీన్నే వర్చువల్ సెక్యూరిటీ అని పిలుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ప్రాసెస్ అనలిస్ట్ అని చెప్పవచ్చు.
అమెరికాకు చెందిన లైవ్ ఐ సర్వేలెన్స్ అనే కంపెనీ పైన చెప్పిన పనిచేసేందుకు భారతీయులను రిక్రూట్ చేసుకుంటోంది. అయితే ప్రస్తుతానికి హర్యానాకు చెందిన వారినే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నారు. దీనికి ఇంటర్ చదివితే చాలు. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ ఆపరేటింగ్ తెలిసి ఉండాలి. ఇక జీతం నెలకు రూ.30వేల వరకు ఇస్తారు. అయితే ఈ విధంగా ఉద్యోగులను నియమించడం వల్ల ఇప్పటికే ఎంతో మందికి వ్యాపార పరంగా లాభం కలుగుతుందని సదరు కంపెనీ తెలిపింది. ఈ క్రమంలోనే త్వరలోనే మరిన్ని ఉద్యోగాలను కల్పిస్తామని ఆ కంపెనీ తెలియజేసింది.