కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు హైకోర్టు నోటీసులిచ్చింది. వైద్య కళాశాలల్లో తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలంటూ గతేడాది ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై మమత ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ పువ్వాడకు నోటీసులు జారీ చేసింది. టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజులు వసూలు చేసుకోవాలని, విద్యార్థుల నుంచి ఎక్కువ వసూలు చేసిన పక్షంలో వారి ఒరిజనల్ సర్టిఫికెట్లతోపాటు ఆ సొమ్మును వాపసు చేయాలని హైకోర్టు గతంలో ఆదేశించింది.
మమత మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేసిన తనకు ఆ ఆదేశాల ప్రకారం రూ.61.35 లక్షలు రావాల్సి ఉన్నా.. ఇంతవరకు అందలేదంటూ డాక్టర్ జి.నిఖిల్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రతివాదిగా ఉన్న మమత ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ పువ్వాడ అజయ్‌కుమార్‌కు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది.