గ్రూప్-1 సర్వీసు నియామకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నియామక ప్రక్రియను కొనసాగించవచ్చంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కు శుక్రవారం హైకోర్టు అనుమతించింది. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో సమాంతర రిజర్వేషన్లను అమలు చేయాలని ఆదేశించింది.
గ్రూప్-1 సర్వీసు నియామకాల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన దాసి బాలకృష్ణ, కె.రోహిత్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.చంద్రయ్య వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ విధానంలో రిజర్వేషన్లు అమలు చేస్తే రిజర్వేషన్లు, ఓపెన్ కేటగిరీ కలిపి 33 శాతానికి మించి మహిళలకే అవకాశాలు దక్కుతాయన్నారు. హారిజాంటల్ (సమాంతర) రిజర్వేషన్లు అమలు చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. మహిళల రిజర్వేషన్‌లను సమాంతర పద్ధతిలో అమలు చేయాల్సి ఉందని రాజేష్‌కుమార్ దానియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. దీనికి విరుద్ధంగా ప్రభుత్వం రిజర్వేషన్‌లను అమలు చేయాలని భావిస్తోందని చెప్పారు.
అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనల వినిపిస్తూ ఎక్కువ శాతం మంది మహిళలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి రిజర్వేషన్‌ల అమలుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నందున మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించారు.