పబ్‌ల నిర్వహణ, నిబంధనలపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. రాత్రి 10 గంటల తర్వాత శబ్ధ కాలుష్యం సృష్టించే పబ్‌లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పబ్‌ల నిర్వహణలో నిబంధనలు, కోర్టు ఇచ్చిన ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది.
నివాస ప్రాంతాల్లో పబ్‌లకు అనుమతిచ్చే ముందు నిబంధనలు అమలు చేశారా, లేదా అనే అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎక్సైజ్ శాఖను హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని వార్నింగ్ ఇచ్చింది.
నివాస ప్రాంతాల్లోని పబ్‌లు సంగీతహోరుతో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని.. అక్కడకు వచ్చే వారు వాహనాలను ఇళ్ల ముందే నిలుపుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేసింది. గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు.. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు కౌంటర్లు దాఖలు చేశారు. హైదరాబాక్ కమిషనర్ తరఫున కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఈ మేరకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.