ఒకే రకమైన కేసుల్లో వేర్వేరు శిక్షలు వివక్షే : తెలంగాణ హైకోర్టు

-

మెడికల్‌ బిల్లుల జారీలో జరిగిన అవకతవకలకు బాధ్యులైన ట్రెజరీ ఉద్యోగులపై చర్యలు వేర్వేరుగా తీసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఒకేరకమైన కేసుల్లో వేర్వేరు శిక్షలు విధించడం చెల్లదని తీర్పు వెలువరించింది.


కరీంనగర్‌కు చెందిన ఎస్‌ఎంపీఎం హష్మి 2001లో పదవీ విరమణ చేయగా, అనుమతుల్లేకుండా బిల్లులు మంజూరు చేశారన్న అభియోగాలను ఎదుర్కొనడంతో పెన్షన్‌లో 30 శాతం కోత విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని సమర్థిస్తూ 2008లో ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హష్మి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎస్‌.నందలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. హష్మి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బిల్లుల మంజూరులో పిటిషనర్‌ పాత్ర ఉండదని పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలతో పలువురు ట్రెజరీ ఉద్యోగులు విచారణను ఎదుర్కొన్నారన్నారు. ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా శిక్షలు విధించిందని తెలిపారు. ఒకరికి ఒక ఇంక్రిమెంట్‌, కొందరికి పెన్షన్‌లో ఏడాదిపాటు 2 శాతం కోత వంటివి విధించిందన్నారు. ఒక వ్యక్తికి 30 శా

తం పెన్షన్‌లో కోత వేయగా ఆ ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించగా 2 శాతం కోతను ఏడాది వరకు పరిమితం చేసిందని తెలిపారు.
దీనిపై ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ విచారణ జరిపాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పదవీ విరమణ చేసి జీవిత సమస్యలతో పోరాడుతున్నారని, సాటి ఉద్యోగులు అనుభవిస్తున్న ప్రయోజనాలను ఆయనకు తిరస్కరించడం అసంబద్ధమవుతుందని ధర్మాసనం పేర్కొంది. ఒకే రకమైన ఆరోపణలు ఎదుర్కొన్నవారికి వేర్వేరు శిక్షలు విధించడం వివక్షాపూరితమేనని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనేనని అభిప్రాయపడింది.

Read more RELATED
Recommended to you

Latest news