ముఖ్యమంత్రి అయినప్పటికీ కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ… దశాబ్దం క్రితం తెలంగాణలో కరవు తాండవించిందని, కానీ ఇప్పుడు పది రాష్ట్రాలకు మన రాష్ట్రం అన్నం పెడుతోందన్నారు. సిద్దిపేటకు గోదావరి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రైతుబిడ్డ కాబట్టి కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారన్నారు.రైతులలో ముఖ్యమంత్రి కేసీఆర్ ధైర్యం నింపారన్నారు. తెలంగాణలో వేసవికాలం కూడా వర్షాకాలం మాదిరి కనిపిస్తోందన్నారు. ఎండాకాలంలోనూ చెరువులు జలకళతో కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో కరవు అనే పదాన్ని శాశ్వతంగా తొలగించామన్నారు.
గత ఎన్నికల్లో సిద్ధిపేట సభకు వచ్చిన సీఎం కేసీఆర్.. హరీష్ ని మళ్లీ గెలిపించండి.. సిద్ధిపేట జిల్లా అవుతుంది, సిద్ధిపేటకు రైలు వస్తుంది, సిద్ధిపేటకు గోదావరి జలాలు వస్తాయి.. అని చెప్పారని, ఇప్పుడు అవన్నీ నిజమయ్యాయని గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేటలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ తో కలసి ఆయన పాల్గొన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు, జన్మ ఉన్నంత వరకు సీఎం కేసీఆర్ కు, సిద్ధిపేట ప్రజలకు సేవ చేసుకుంటానని, మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు చర్మం వలిచి చెప్పులు కుట్టించుకున్నా తక్కువేనన్నారు. జన్మంతా కేసీఆర్ కు, ప్రజలకు రుణపడి ఉంటానన్నారు హరీష్ రావు.