అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. అంశాల వారీగా చేయాల్సిన పోరాటాలపై నాయకులకు అవగాహన కల్పించేందుకు పీసీసీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో అవగాహన సదస్సు నిర్వహించనుంది. పీసీసీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నవారు.. సదస్సులో పాల్గొనడంపై అనుమానాలు ఉన్నాయి. ఏఐసీసీ ఆదేశాల మేరకు హాత్ సే హాత్ జోడో అభియాన్ సదస్సుకు రావాలా…? వద్దా ..? అని సీనియర్లు తర్జనభర్జనలు పడుతున్నారు.
మొదటి సెషన్‌లో ధరణి సమస్యలు, వాటి పరిష్కారంపై నిపుణులతో అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత జనవరి 26 నుంచి చేపట్టనున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఎవరెవరు ఏ జిల్లాలో పాదయాత్ర చేయాలి.. యాత్రలో ప్రజల్లోకి ఏయే అంశాలను తీసుకెళ్లాలనే అంశాలను నాయకులకు సూచిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సదస్సు ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడనున్నారు.