జాతీయ పంచాయతీ అవార్డుల్లో మరోసారి తెలంగాణ తన సత్తా చాటింది. జాతీయ పంచాయతీ పురస్కారాల కింద 48 అవార్డులు ప్రకటిస్తే రాష్ట్రానికి 13 లభించాయి. దేశవ్యాప్తంగా అత్యధిక అవార్డులతో రాష్ట్రం నం.1 స్థానంలో నిలిచింది. జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల కింద తొమ్మిది కేటగిరీల్లో గ్రామ పంచాయతీలకు అవార్డులు ప్రకటించింది. ఇందులో ఎనిమిది కేటగిరీల్లో రాష్ట్ర పంచాయతీలకు అవార్డులు (నాలుగు కేటగిరీల్లో ఫస్ట్ ర్యాంకు) వచ్చాయి.
ఈ పురస్కారాల కింద జాతీయస్థాయిలో 27 అవార్డులు ప్రకటిస్తే అందులో తెలంగాణ 8 అవార్డులతో తొలిస్థానం దక్కించుకుంది. నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ కింద ఉత్తమ మండల, జిల్లా స్థానిక సంస్థలకు అవార్డులను ప్రకటించారు. మొత్తం 21 అవార్డులు ప్రకటిస్తే అందులో తెలంగాణకు అయిదు లభించాయి. ఏప్రిల్ 17న దిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేస్తామని, సంబంధిత ప్రజాప్రతినిధులను ఒకరోజు ముందుగా దిల్లీకి పంపించాలని రాష్ట్రానికి లేఖ రాశారు.