తెలంగాణ సర్కార్ ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగిసింది. సకాలంలో ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అందక చాలామంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేక పోయారు. ఎంబీసీలతోపాటు 14 బీసీ కులవృత్తుల వారికి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పణకు మంగళవారమే తుది గడువు కావడంతో వృత్తిదారులు మీసేవా, తహసీల్దారు కార్యాలయాలకు పరుగులు పెట్టారు. కావాల్సిన పత్రాలు తీసుకోలేక కొందరు నిరాశకు గురయ్యారు. మొత్తానికి మంగళవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 5.50 లక్షల దరఖాస్తులు అందాయి. అర్ధరాత్రి సమయానికి మరో 50 వేల దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఆర్థిక సాయానికి దరఖాస్తులు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీతోనే గడువు ముగిసిందని, ఇప్పటి వరకైతే పొడిగింపు లేదని కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ క్లారిటీ ఇచ్చారు. సాయం అందజేత నిరంతర ప్రక్రియని, అర్హులందరికీ విడతల వారీగా సాయం అందుతుందని భరోసా ఇచ్చారు.