నీట్-2024 పరీక్షలో అవకతవకలపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలు స్పందించారు. తాజాగా మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేకపోతోందని ఆయన ఆరోపించారు. యూజీసీ నెట్ పరీక్ష రద్దు చేసిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
నీట్ కుంభకోణం తర్వాత పేపర్ లీకేజీతో యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేశారు. గడచిన ఐదేళ్లలో దేశంలోని 15 రాష్ట్రాల్లో 41 ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. పరీక్షలు రాసిన కోటీ 40 లక్షల మంది యువత భవిష్యత్‌తో ఆటలు ఆడుకున్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా పేపర్ లీకేజీ ఓ కారణమా? పరీక్షా ప్రశ్నాపత్రం రద్దు చేస్తే యువత కఠోర శ్రమ వృధా అవుతుంది. మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో? అసలు పెడతారో లేదో? కూడా తెలియదు. దాదాపు పది లక్షల మంది యూజీసీ – నెట్ పరీక్ష రాశారు. వారికి క్షమాపణలు చెబుతారా? వారికి జరిగిన నష్టానికి పరిహారం ఇస్తారా? అని ఒవైసీ ప్రశ్నించారు.