Telangana : మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాశ్‌ బాధ్యతలు

-

తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాశ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవికి ఆయన పేరును మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రతిపాదించగా.. సభ్యులు జాఫ్రీ, మధుసూదనాచారి, హోం మంత్రి మహమూద్‌అలీ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎం.ఎస్‌.ప్రభాకర్‌, ఎగ్గే మల్లేశం బలపరిచారు. ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు.

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మజ్లిస్‌ ఎమ్మెల్సీ ఇఫెండీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, రఘోత్తమ్‌రెడ్డి తదితరులు బండా ప్రకాశ్‌ను మండలి ఛైర్మన్‌ స్థానంలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు.

మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికై, బాధ్యతలు తీసుకోవడం సంతోషకరం అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘సామాన్య కుటుంబం నుంచి వచ్చి.. పీహెచ్‌డీ పూర్తిచేసి, ఎన్నో పుస్తకాలను ఎడిట్‌ చేశారు. ఉన్నత విద్యావంతుడిగా వరంగల్‌ జిల్లాకు సుపరిచితులు. చిన్న వయసులోనే వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. రాజ్యసభ నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలన్న పిలుపు మేరకు ఇక్కడికి వచ్చారు. నూతన రాష్ట్ర పునర్‌ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. డిప్యూటీ ఛైర్మన్‌గా శాసనమండలిని సమర్థంగా నడిపించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నా’’ అని సీఎం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news