బండి సంజయ్ తెలంగాణ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలను సంప్రదిస్తామని.. కేసీఆర్ తో తెలంగాణ ఉద్యోగులకు ఉద్యమ బంధం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ఉద్యోగులకు మధ్య పేగు బంధం ఉంటుందన్నారు రాజేందర్. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు మంచి చేసిందన్నారు.
బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. సకల జనుల సమ్మెలో ఉద్యోగులకు సంజయ్ ఎందుకు మద్దతు ఇవ్వలేదన్నారు. ఉద్యోగులు వ్యక్తులు కాదు శక్తులని అన్నారు. బేషరతుగా బండి సంజయ్ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే రేపట్నుంచి వరుస ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే టీఎన్జీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల జీతాలు కాదు జీవితాలు ముఖ్యమని చెప్పామని.. అయినప్పటికీ ఉద్యోగులపై ఎన్నోసార్లు అవమానకర రీతిలో మాట్లాడారని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకునే వ్యక్తి అని కొనియాడారు. సీఎం కేసీఆర్ మేము ఎప్పుడూ అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చారని.. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులు అనుకూలంగా ఉండటంలో తప్పు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడి పని చేస్తుండటంతోనే కేంద్రం, రాష్ట్రానికి అవార్డులు ఇస్తుందన్నారు.