Bhatti Padayatra : నల్లగొండ నియోజకవర్గంలో ఇవాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగనుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 93వ రోజు నల్లగొండ నియోజకవర్గంలో కొనసాగనుంది. నల్లగొండ నియోజకవర్గం జి చెన్నారం గ్రామం నుంచి పాదయాత్ర ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది.
జి చెన్నారం, కొత్తపల్లి, కొతల్గూడ, నల్లగొండ, ఎంపీడీవో ఆఫీస్, నల్లగొండ క్లాక్ టవర్, పానగల్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. నల్లగొండ పట్టణంలోని ఎంపీడీవో ఆఫీస్ కార్యాలయం సమీపంలో లంచ్ బ్రేక్ ఉంటుంది. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్లగొండ పట్టణానికి చేరుకుంటున్న సందర్భంగా వేలాది మందితో భారీ ర్యాలీ ప్రదర్శనతో పాటు క్లాక్ టవర్ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు కార్నర్ మీటింగ్ ఉంటుంది.
సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర బృందం ఈరోజు రాత్రికి పానగల్ వద్ద బస చేస్తారు. కార్నర్ మీటింగ్ కు భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తంకుమార్ రెడ్డి గారు తదితర కాంగ్రెస్ అగ్ర నేతలు పాల్గొంటారు. ఇక నిన్న పాదయాత్రలో భాగంగా భట్టి మీడియాతో మాట్లాడారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు, రోడ్లకు ఇరువైపులా ఉన్న భూములను ప్రభుత్వం ధరణిలో పెండింగ్ లో పెట్టిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
ఈ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ధరణి సమస్యలు నేను ఎత్తి చూపిస్తే.. సీఎం కేసిఆర్ తలకాయ లేని వాడిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇంతకంటే మెరుగైన రెవెన్యూ వ్యవస్థ ఉందన్నారు.హైదరాబాద్ చుట్టు పక్కల మేము పేదలకు పంచిన భూములను మీరు బహుళ కంపెనీలకు ఇచ్చారో లేదో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న కేసిఆర్ కు కుర్చీ దొరకలేదా..? అని నిలదీశారు భట్టి.