మునుగోడు ఉప ఎన్నికను ఎప్పుడు నిర్వహిస్తే అప్పుడు కార్యాచరణలోకి దిగాలని ఓవైపు టిఆర్ఎస్, మరోవైపు బిజెపి కాచుకు కూర్చున్నాయి. మధ్యలో కాంగ్రెస్ కూడా తన సొంత సీటును దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. మూడు ప్రధాన పార్టీలూ గ్రామ గ్రామాన జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. అక్టోబర్ చివరి వారంలో మునుగోడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణ పర్యటనకు వచ్చిన హోం మంత్రి అమిత్ షా ఈ మేరకు పార్టీ నేతలకు సూచనలు ఇచ్చినట్లు సమాచారం.
ఈ ఉప ఎన్నిక ఎప్పుడు ఉంటుందన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పలేదట. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్ట్రాటజీ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. గ్రామాల వారీగా కమిటీలు వేసి సర్వేలు నిర్వహించారు. ఈ సర్వే రిపోర్టులతో పాటు ఉపఎన్నిక ప్రచారం, ఎన్నిక వ్యూహాలపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ సమావేశానికి బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్, జితేందర్ రెడ్డి, స్వామి గౌడ్ తదితరులు హాజరయ్యారు.