పెద్దఎత్తున నిరసనలకు సిద్ధమవుతున్న బిఆర్ఎస్

-

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈడి కార్యాలయంలోకి వెళ్లే ముందు పిడికిలి బిగించి అభివాదం చూపిస్తూ కవిత కార్యాలయంలోపలికి వెళ్లారు. కవితను అరెస్టు చేసే అవకాశం ఉందని ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తే దేశ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే హస్తినలో ఐదుగురు బిఆర్ఎస్ మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు ఆ పార్టీ నేతలతో వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కవితను అరెస్టు చేస్తే ఈడి ఆఫీస్ ఎదుట బైఠాయింపు సహా ఇతర నిరసన కార్యక్రమాలకు బిఆర్ఎస్ సమాయత్తమవుతుంది.

ఇక మరోవైపు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు సీఎం. ఒకవేళ కవితను అరెస్టు చేస్తే ఎలా స్పందించాలనే విషయాలపై సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news