తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోన్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి అదిరిపోయే షాక్ తగిలేందుకు రంగం సిద్ధమైంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఆశిస్తోన్న మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ అభ్యర్థిత్వం దక్కే అవకాశాలు లేవని తెలియడంతో కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అవుతోన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించలేదు. సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పేరును ప్రకటించాలని అనుకుంటున్నా.. అధికార పార్టీలో జరుగుతోన్న పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కూడా కాంగ్రెస్ వెయిట్ చేస్తోంది.
చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే ఆయనకు కాంగ్రెస్ సీటు ఇస్తామన్న ఆపర్లు ఇప్పటికే ఆయనకు వెళుతున్నాయట. ఇక శ్రీనివాస్‌రెడ్డికి టీఆర్ఎస్ సీటు రాదన్న విషయం తెలియడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరే అంశంపై కొంపల్లిలో తన అనుచరులతో సమావేశమై మంతనాలు జరిపారు. టీఆర్ఎస్ టిక్కెట్ మృతి చెందిన రామలింగారెడ్డి తనయుడు లేదా భార్యకు ఇవ్వాలని ఆ పార్టీ దాదాపు నిర్ణయం తీసుకోవడం.. ఇటు ఈ ఉప ఎన్నిక బాధ్యతలు చూస్తోన్న ఆర్థికమంత్రి హరీష్‌రావు సైతం అటు వైపే మొగ్గు చూపడంతో శ్రీనివాస్ రెడ్డి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయాలా ? లేదా కాంగ్రెస్‌లో చేరాలా ? అన్న సమాలోచనలు జరిపారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఆయన పార్టీలోకి వస్తే ఆయనకే సీటు ఇస్తామన్న ఆఫర్ పంపిందట. ఇక శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడమే తరువాయి వెంటనే ఆయన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే తన తండ్రి ముత్యంరెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. ఆ ఎన్నికల సమయంలోనే ముత్యంరెడ్డికి ఎమ్మెల్సీ లేదా మరో కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ముత్యంరెడ్డి చనిపోవడం.. అటు రామలింగారెడ్డి కూడా మృతి చెందడంతో శ్రీనివాస్ రెడ్డి ఈ సీటు తనకే ఇవ్వాలని పట్టుబట్టారు.
అయితే టీఆర్ఎస్ ఆలోచన రామలింగారెడ్డి ఫ్యామిలీకే సీటు ఇవ్వాలన్నట్టుగా ఉండడంతో శ్రీనివాస్ రెడ్డి మరో నిర్ణయం తీసుకోక తప్పడం లేదని తెలుస్తోంది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. దుబ్బాకలో నవంబర్ 3వ తేదీన పోలింగ్, 10 కౌంటింగ్ ఉంటుంది. ఈ నెల 9న నోటిఫికేషన్, 16 వరకు నామినేషన్ల స్వీకరణ.. అక్టోబర్ 19 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది.
-Vuyyuru Subhash