విదేశీ క్యాసినోల వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ ప్రవీణ్ బృందాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) వరుసగా మూడో రోజు విచారించింది. దాదాపు 10 గంటలపాటు ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్, దాసరి మాధవరెడ్డిలను విచారించారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. ఆర్థిక లావాదేవీలు, క్యాసినో క్యాంపుల ప్రమోషన్ కోసం సినీ తారలకు సొమ్ములు ఏ రూపంలో చెల్లించారు.. ఎంత డబ్బు వారికి ముట్ట జెప్పారు తదితర అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు.
అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ.. ఈడీ మరోసారి నోటీసులు జారీ చేస్తే విచారణకు హాజరవుతానని చెప్పటినట్లు ప్రవీణ్ పేర్కొ్న్నాడు. తాను ఎవరిని క్యాసినో ఆడమని చెప్పలేదని, తనకు ప్రాణహాని ఉందని ప్రవీణ్ పేర్కొన్నాడు. ఈ విషయమై పోలీసుల అధికారులను కలిసి భద్రత కల్పించాలని కోరినట్లు అతడు చెప్పాడు.
ఈడీ ఎదుట హాజరయ్యే ముందు ప్రవీణ్ సీసీఎస్ కు వెళ్లాడు. తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో తనకు పరిచయమే లేదని క్యాసినో కేసు నిందితుడు చీకోటి ప్రవీణ్ స్పష్టం చేశాడు.. కొందరు తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి తప్పుడు పోస్టులు చేస్తున్నారని అన్నాడు. ఈ విషయంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.