ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని సందర్శించనున్నారు. దాదాపు రెండున్నర దశాబ్ధాల తర్వాత కేసీఆర్ వస్తుండటంతో ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దివ్యక్షేత్రాన్ని యాదాద్రి తరహాలో అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే రాష్ట్ర సర్కార్ రూ.100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా చేపట్టాల్సిన పనులు.. చేయాల్సిన మార్పులపై అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సుమారు రెండు గంటలపాటు కొండగట్టు క్షేత్రంలో పర్యటించనున్న కేసీఆర్.. ఆలయ ప్రాంగణాన్నిఅధికారులతో కలిసి పరిశీలించనున్నారు. స్వామివారికి పూజలు నిర్వహించిన తర్వాత ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయితో కలిసి ఆలయాభివృద్ధి ప్రణాళికలపై చర్చిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సమాలోచనలు జరుపుతారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
కొండగట్టు పునర్నిర్మాణ పనులపై భక్తుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఏళ్లుగా తగిన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నామని… ఇప్పటికైనా అన్ని పరిష్కారమవుతాయని ఆకాంక్షిస్తున్నారు.