స్వతంత్ర భారత వజ్రోత్సవాలు.. నేడు కార్యాచరణ ఖరారు చేయనున్న సీఎం

స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఖరారు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి రెండు వారాల పాటు వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు.

కార్యక్రమాల రూపకల్పన కోసం రాజ్యసభ సభ్యుడు కేశవరావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ పలుమార్లు సమావేశమై పక్షం రోజులపాటు నిర్వహించాల్సిన వివిధ కార్యక్రమాలపై చర్చించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలు, కార్యాచరణ, విధివిధానాలు, సంబంధిత అంశాలపై కమిటీతో సీఎం కేసీఆర్ ఇవాళ సమావేశం కానున్నారు.

ప్రగతిభవన్​లో కమిటీతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. కమిటీ ప్రతిపాదించిన అంశాలను పరిశీలించడంతో పాటు చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాలను ఖరారు చేసి ప్రకటించనున్నారు.