“నేను ఆఖరి రెడ్డి సీఎం ను అయినా పర్వాలేదు.. మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాను” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీ భవన్ లో కులగణన, ఎస్సీ వర్గీకరణ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఆయన మాట్లాడారు. “కులగణన నా కోసం.. నా పదవీ కోసం చేయలేదు. త్యాగానికి సిద్దపడే కులాల లెక్కలను పక్కాగా తేల్చాం. మా నాయకుడిని ఆదర్శంగా నిలబెట్టేందుకు నేను కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధం” సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కులగణన పై ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరుగలేదు. ఇప్పుడు కులగణన సర్వేను తప్పు పడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారు. దేశం మొత్తం కులగణన సర్వే జరగాలని పార్లమెంట్ లో మోడీని రాహుల్ గాంధీ నిలదీశారని.. ఈ సర్వే జరగకూడదని మోడీ, కేడీలు కుట్ర చేస్తున్నారని తెలిపారు. అధికారిక లెక్కలు ఉంటే బీసీల రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు కు కూడా చెప్పవచ్చని.. కులగణన సర్వే రెండో విడత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.