అబద్ధపు హామీలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది : ఈటల రాజేందర్

-

అబద్ధపు హామీలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి  ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తాజాగా ఓల్డ్ బోయిన్ పల్లి, రైతు సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు ఈటల రాజేందర్.ఈ నియోజక వర్గానికి మేడ్చల్, ఘట్ కేసర్‌లలో రైతుల కమిటీలు కూడా కలుస్తాయి. మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించడానికి ఇంత ఎర్రటి ఎండలో మీరందరూ వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని బూటకపు హామీలు ఇచ్చిందో మీకు తెలుసు. చదువుకున్నవారు కానీ, వ్యాపారస్తులు కానీ వారిని నమ్మి ఓట్లు వేయరని వారికి అర్థమైంది. పేదవారిని ప్రలోభ పెట్టి, రైతులకు రుణ మాఫీలు చేస్తామని అబద్దపు హామీలు ఇచ్చి వారిచేత ఓట్లు వేయించుకుందామనుకుంటున్నారు. మరోసారి రైతులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు విలువ లేకుండా పోయింది.

గత పదేళ్ల మోదీ గారి పాలనలో ప్రశాంతంగా ఉన్నామని, మరోమారు ఆయనకే ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏ ఇంటికి పోయినా బీజేపీ కార్యకర్తలకు మిక్కిలి మర్యాదలు లభిస్తున్నాయి. పదేళ్ల క్రితం బీజేపీ తెలంగాణలో గెలుస్తుందని ప్రజలు నమ్మలేదు. కానీ ఇప్పుడు మోదీ పాలనపై అందరికీ విశ్వాసం ఏర్పడింది.బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలోనే వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే ఈ పార్టీకి ఓట్లు వచ్చే ప్రశ్నే లేదు.

ఇక రేవంత్ రెడ్డి మహిళలకు ఎన్నో పథకాలు ప్రకటించారు. పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి పథకం కింద లక్ష రూపాయల నగదు, తులం బంగారం ఇస్తానని మభ్యపెట్టాడు. మహిళలకు 2,500 రూపాయల పెన్షన్, వృద్ధులకు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రమాణ స్వీకారం చేయగానే పథకాలు అమలు చేస్తానని చెప్పాడు. కానీ ఇంకా ఏవీ నెరవేర్చలేదు. రాష్ట్రప్రభుత్వ వద్ద అప్పులే కానీ, పథకాల కోసం నిధులు లేవు. లంకెబిందెలు ఉన్నాయని వచ్చా, కానీ ఖాళీ ఖజానా కనిపిస్తోందని రేవంత్ రెడ్డి అంటున్నాడు.

మద్యం షాపుల వల్ల వచ్చే ఆదాయం తప్ప తెలంగాణకు ఆదాయం వచ్చే మార్గం లేదు. పైగా రాహుల్ గాంధీ ప్రధాని అయితే హామీలన్నీ నెరవేర్చగలమని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కేవలం 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎలా వస్తుంది.దీనిని బట్టి రాష్ట్రప్రభుత్వం ఏ రకమైన హామీలను నెరవేర్చేది లేదని అర్థమవుతోంది . పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యతను కేంద్రప్రభుత్వమే నేరుగా తీసుకుంటుందని ప్రధాని మోదీ ప్రకటించారు

ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల రూపాయల వరకూ పేదలకు ఉచిత వైద్యం అందిస్తోంది కేంద్రప్రభుత్వం. అంతేకాక ఇన్సూరెన్స్‌లు కూడా అమలు చేసే బాధ్యతను తీసుకుంది. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థినైన నాకు ఇక్కడ సమస్యలను నేరుగా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లగలిగే చొరవ ఉంది. ఈ నియోజక వర్గంలో గెలిస్తే మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు గెలిచినట్లు లెక్క. దేశంలోనే పెద్ద లోక్‌సభ నియోజక వర్గమైన ఈ స్థానంలో మనం గెలిస్తే, రాష్ట్రంలో 15 అసెంబ్లీ స్థానాన్ని ప్రభావితం చేయవచ్చు. బీజేపీ పార్టీకి ఓట్లు వేసేలా ప్రజలను ప్రభావితం చేయవలసిందిగా, ఇంటిటికీ కరపత్రాలను పంచి, ప్రధాని మోదీ పథకాలను తెలియజేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news