ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య మూడుకు చేరింది. సమావేశానికి ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. ఆ నిప్పురవ్వలు ఎగిసిపడి సమీపంలోని గుడిసెపై పడడంతో మంటలు చెలరేగాయి.
మంటలను అదుపుచేసేందుకు అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు బిందెలతో నీళ్లు చల్లారు. మంటల తాకిడికి గుడిసెలో ఉన్న సిలిండర్‌ను ఎవరూ గమనించలేదు. ఈ క్రమంలో అది ఒక్కసారిగా పెద్దశబ్దంతో పేలింది. సిలిండర్ పేలుడు ధాటికి 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల శరీరభాగాలు ఛిద్రమై పరిస్థితి హృదయవిదారకంగా మారింది.
క్షతగాత్రులను పోలీసు వాహనాల్లో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలో ఒకరు… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిలో నలుగురిని హైదరాబాద్ నిమ్స్‌కి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.