కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాడ వాడకు సీఎంలే ఉన్నారు.. ప్రతి ఒక్కరూ నన్ను గెలిపిచండి నేను ముఖ్యమంత్రి అయితా అంటున్నారు. అసలు కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు అని కేసీఆర్ అన్నారు. హుజుర్‌నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఒక్క హుజుర్‌నగర్‌లోనే కాదు.. దేశమంతా కాంగ్రెస్ పార్టీది అదే పరిస్థితి అని కేసీఆర్ తెలిపారు. నేను ముఖ్యమంత్రి అయితా అని ఒకరు.. నేను బుడ్డెరఖాన్ అయితా అని ఇంకోకడు.. నేను ఇది అయితా అని ఒకడు.. రరకకాల మాయమాటలు చెప్పి గోల్ మాల్ చేసి ఓట్లు అడుగుతున్నారు. పార్టీల తరపున నిలబడే వ్యక్తులనే కాదు.. ఆ పార్టీల నైజం, దృక్పథం గురించి తెలుసుకోవాలి అని కేసీఆర్ సూచించారు.
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు, మంచినీళ్ల కోసం అనేక కష్టాలు పడ్డాం.. ఇవాళ అన్ని సమస్యలను అధిగమించుకున్నాం అని కేసీఆర్ తెలిపారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దుకున్నాం.. వారి హక్కులను కాపాడినం. ఇవాళ మేజర్‌గా కృష్ణా నదిలో నీళ్లు రాలేదు. శ్రీశైలం దాకా నిండింది. సాగర్ దాకా నీళ్లు రాలేదు. స్థానిక ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు. పంటలు పాడు అవుతున్నాయి.. పది పన్నెండు రోజులు నీళ్లు వదలాలి అని కోరితే అధికారులను పిలిచి మాట్లాడి నీళ్లను వదిలించాం. హుజుర్‌నగర్‌కు వారం పది రోజుల పాటు మళ్లీ నీళ్లు పంపిస్తాం. రందీ పడాల్సిన అవసరం లేదు. ఇలా సంసారం చేసుకుంటున్నట్టు ముందకు పోతున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు.