తెలంగాణ బీజేపీలో కీలక మలుపు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దిల్లీకి బయల్దేరారు. ఆయన సడెన్ పర్యటనతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. అధిష్ఠానం పిలుపు మేరకే ఈటల హస్తినకు వెళ్లినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. పార్టీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ రెండు వర్గాలుగా విడిపోయినట్లు అధిష్ఠానం దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీంతో గ్రూపులను రూపుమాపే చర్యలను చేపట్టిన అధిష్ఠానం.. ఇందులో భాగంగానే ఈటలను దిల్లీకి పిలిచినట్లు తెలుస్తోంది.
కొంతకాలంగా రాష్ట్ర బీజేపీలో ఈటల వర్సెస్ బండి వైఖరి నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగైనా ఈసారి తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి ఇది పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈటలను దిల్లీకి పిలిచినట్లు సమాచారం. పార్టీలో అంతర్గత విభేదాలు అసలుకే ఎసరు తెస్తాయని భావిస్తున్న అధిష్ఠానం వీలైనంత త్వరగా ఈ సమస్యకు చెక్ పెట్టే పనిలో పడిందని రాజకీయ వర్గాల్లో టాక్.