నేడు నిర్మల్ లో పర్యటించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని.. తెలంగాణలో రైతుకు విలువే లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజల పట్ల నిలబడే వ్యవస్థ లేదన్నారు వైయస్ షర్మిల. కాలేశ్వరంలో 70 వేల కోట్ల అవినీతి జరిగితే ఎవరూ నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందరూ దొంగలే.. వారి వాటాలు వారికి వస్తే చాలని దుయ్యబట్టారు. దళిత బంధును కాస్త అనుచరుల బంధు చేశారని ఆరోపించారు. కెసిఆర్ ప్రతి వర్గాన్ని వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. కెసిఆర్ లో కనీస చలనం కూడా లేదని.. ఆయన జాతిలో ఉన్నది గుండె కాదు బండ అని అన్నారు. రాష్ట్రంలో 13 లక్షల పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని మండిపడ్డారు.