రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓంకార్ నగర్‌లోని ఓ ఫర్నీచర్ షాప్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. అగ్ని కీలలకు దుకాణంలోని ఫర్నిచర్, సామగ్రి పూర్తిగా దగ్ధమైంది.
రూ.కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని దుకాణం యజమాని అంచనా వేశారు. అయితే అగ్నిమాపక శాఖ అధికారులు సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి రాలేదని యజమాని ఆరోపించారు. గంటన్నర ఆలస్యంగా రావడంతో భారీగా నష్టం వాటిల్లినట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆలస్యంగా వచ్చిన తర్వాత.. నీళ్లు లేక పోవడం వల్ల మంటలు ఆర్పడం మరింత ఆలస్యమైందని చెప్పారు.
పక్కనే ఉన్న థర్మోకోల్ కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని ఫర్నీచర్ షాప్ యజమాని ఆరోపించారు. మరోవైపు ప్రమాదం చోటుచేసుకున్న గంట తర్వాత ఫైర్ ఇంజిన్లు రావడంతో కోట్ల రూపాయలు నష్టపోయానంటూ కన్నీటి పర్యంతమయ్యారు.